||అహం బ్రహ్మస్మి ||

పుట్టింది మొదలు
గిట్టేవరకూ
నువ్వెంత రూపాంతరం చెందినా
నాకు నచ్చుతావ్ చూడు
నేను అప్పుడు "అమ్మ"ని

బరువు మోయడం
భాధ్యతని ఎరిగి
భుజం మోపినపుడు
భారం తగ్గిన "తండ్రి"ని

బ్రహ్మ,విష్ణు , మహేశ్వరుల
కరువైన కర్మ సిద్దాంతాన్ని
గుట్టురట్టు చేస్తూ నేను దాన్ని భోదిస్తానా
నేను "గురువు"ని

సాంతం తప్ప మరేరసమూ తెలియని స్థితిలో
నవ్వుతూనో ,నాలుకతీసి ఎక్కిరిస్తూనో
నేను "పిల్లవాన్ని"

యవ్వనాలన్నీ పువ్వులై
పరిమళిస్తుంటే
ముక్కు మూసుకుని నాదారిన నేను నడుస్తానా!
నేను "యువకున్ని"

మనసు ముద్రించుకున్న జీవితాలు కొన్ని
సంపుటులుగా చదువుతూ
జీవించడాన్ని నేర్చుకుంటానా!
నేను "విద్యార్ధిని"

పనియే దైవమని నమ్మి
దైవత్వాన్ని దరిస్తానా!
నేను "ఉద్యొగి"ని

అర్దనారీశ్వర తత్వానికి
అర్ధమే తెలియకున్నా
అర్ధబాగాన్ని అర్పించినపుడు
"అర్దాంగి"ని

శృంగారం, దైవం సమానమనినమ్మి
సంసార కార్యాలు చేస్తున్నప్పుడు
నేను బాధ్యతని, "భర్త"ని

తమలపాకులాంటి తనువొకటి
తళ తళా మెరుస్తూ
తనువే తామ్బూలమైంది
తిను అన్నప్పుడు
నేను బోజనప్రియున్ని

ఇచ్చినవన్నీ చాలవన్నట్లు
అప్పనంగా అక్షరాలడుగుతూ
చిత్రమైన చింతామణి నా ముందు చిందులేస్తుంటే
నేను "కవి"ని

మూడుకోతులు ముచట్లన్నీ
పురానికి హితువుగా చెబుతూ
పంచెకట్టిన "పురోహితున్ని"

కాలచక్రంమ్మీద మార్పు అన్న మట్టిని పెట్టి
గుండ్రంగా తిప్పుతూ
కుండచేసి కడుపు నింపుకున్నాక
నేను "కుమ్మరిని"

ఒంగని,లొంగని ఉక్కు భావాలన్నీ
కొలిమిలో కాల్చుతూ
గుండెల్లో గునపాలు దింపుతుంటే
నేను "కమ్మరిని"

రంగు,రంగుల హంగులల్లుతూ
రూపాన్ని కప్పేస్తుంటే
నేను "పద్మసాలిని "

మీ అందరికీ అన్నంపెట్టి
నా ఆకలి ,అప్పు తీరక
ఆత్మహత్య చేసుకున్నాక
నేను "రైతు" ని

ధన దాహమేస్తున్నప్పుడు
దాన్ని తాగలేక పోగుచేసుకుంటాను చూడు
నేను "అధికారిని"

వేషం తీసి , వేషం మార్చి
నా పాత్రలన్నీ నేను పోషిస్తానా!
నేను "నటున్ని"

ఇవన్నీ ఎందుగ్గాని
నువ్వెవరు ? అని అడిగితే మాత్రం
మనసువిప్పి మాట్లాడగలిగితే
"నేను దేవుణ్ణి "

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు