|| అంకెలు ||


0.శూన్యంతో మొదలై
శూన్యంతోముగిస్తే
ఆ లెక్క లెక్కలోకి రాదు

1.ఒకరు,ఒకరితో
ఒక్కటైనపుడు కూడా
ఒంటరితనం ఉండనే ఉంటుంది

2.రెండు శరీరాలు,
రెండు మనసుల కోరికేమిటో
రెండో ఎక్కం రానివాడు కూడా చెప్పగలడు

3.మూడుముళ్ల ముచ్చటలో కూడా
మూతిముడుచుక్కూచున్న రూపం
మాతృమూర్తై పోతుంది

4.నాలుగుచేతులే
నాలుగు వైపులా చేరి
నిన్నూ ,నన్నూ అక్కడిదాకా సాగనంపుతాయ్

5.అయిదొందలు
అప్పడగాడానికి
ఆత్మాభిమానాన్ని
అవతలోడికి అమ్మేయాల్సుంటుంది

6.ఆరు పువ్వులు
మూడు కాయలు కాస్తే
ఆదునికలోకం పొదుపు అంటుంది

7.ఎడడుగులూ
ఎవరితో
ఎప్పుడెయ్యాలనేది
ఎప్పుడో రాసేవుంటుంది

8.ఎనిమిది దిక్కులున్నా
నువ్వే మాకుదిక్కని కొలిచే నీ ప్రపంచం నీకుంది

9.తొమ్మిదో ఏట తీరని కోరిక
తొంబయ్యోయేటదాక తరుముకొచ్చి
ఆత్మను హత్యకు గురిచేసి
శరీరాన్ని సంపుకు తింటుంది
చచ్చేటప్పుడు చావమని

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు