పోస్ట్‌లు

October, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

|| అంకెలు ||

0.శూన్యంతో మొదలై
శూన్యంతోముగిస్తే
ఆ లెక్క లెక్కలోకి రాదు

1.ఒకరు,ఒకరితో
ఒక్కటైనపుడు కూడా
ఒంటరితనం ఉండనే ఉంటుంది

2.రెండు శరీరాలు,
రెండు మనసుల కోరికేమిటో
రెండో ఎక్కం రానివాడు కూడా చెప్పగలడు

3.మూడుముళ్ల ముచ్చటలో కూడా
మూతిముడుచుక్కూచున్న రూపం
మాతృమూర్తై పోతుంది

4.నాలుగుచేతులే
నాలుగు వైపులా చేరి
నిన్నూ ,నన్నూ అక్కడిదాకా సాగనంపుతాయ్

5.అయిదొందలు
అప్పడగాడానికి
ఆత్మాభిమానాన్ని
అవతలోడికి అమ్మేయాల్సుంటుంది

6.ఆరు పువ్వులు
మూడు కాయలు కాస్తే
ఆదునికలోకం పొదుపు అంటుంది

7.ఎడడుగులూ
ఎవరితో
ఎప్పుడెయ్యాలనేది
ఎప్పుడో రాసేవుంటుంది

8.ఎనిమిది దిక్కులున్నా
నువ్వే మాకుదిక్కని కొలిచే నీ ప్రపంచం నీకుంది

9.తొమ్మిదో ఏట తీరని కోరిక
తొంబయ్యోయేటదాక తరుముకొచ్చి
ఆత్మను హత్యకు గురిచేసి
శరీరాన్ని సంపుకు తింటుంది
చచ్చేటప్పుడు చావమని

||అ ఆ ఇ ఈ||

అ||. అద్దం ముందు
అద్దం నుల్చుని
అందాన్ని చూసుకుంటే
అనంతమైన ప్రతిబింబాలు ..........
అందుకే
అతన్ని
అతను
అంతలా చూసుకుంటాడు .
ఆ||. ఆ తర్వాత
ఆరంబించకుండానే
ఆదిపత్యం గురించి
ఆలోచిస్తాడేమో
ఆశపుట్టి
ఆవిరైపోతుంటుంది
ఇ|| .ఇంతలోనే
ఇద్దరిమద్యా
ఇబ్బందేమీ లేకుండా
ఇమిడిపోదామన్న కాలం
ఇప్పుడుకుదరదు
ఇంకొంతకాలం ఆగమంటుంది
ఈ||.ఈలోగా
ఈత నేర్చుకుని
ఈడు దాటేసిన
ఈతగాన్ని చూసి
ఈలోకం చూసి
ఈలవేస్తుంది
ఈర్స్యపడుతుంది కూడా !

||సొంతడబ్బా కొంతమానకు||

పొద్దున్నే లెగిసి

ఓ ముద్దు ముడుపిచ్చి.

మద్దేలకు తిరిగొచ్చి

మళ్ళీ మూతి బిగించి

సాయం’కాలానికి’ గేలమేసి

నీ సూపులన్ని పట్టేసి.

ఆ కాలాన్ని నిలవేసి

కవితలెన్నోరాసి.

చుక్కలొన్నో తెచ్చి

నీ పక్కన పడేసి

రాత్రులెన్నో రాసిచ్చే

నాలాటి వస్తాదు మొగుడొస్తాడని

ముస్తాబైన బుల్లెమ్మా

నీ దస్తావేజులు పట్రా!

ఓ సంతకం సేసేత్తాను.

|| ‎ మా వాకిట్లో ||

అడ్డంగా నేనున్నాకదా
అలా తిరిగిరా అన్నట్టు
తులస్సెట్టు.


పచ్చడి చేసే
పేరుమోసిన
సందికాయిలి.

దంచి పడేస్తానన్న
మాంచి రోలు.

ఉచితంగా
ఉతికారేసే
బట్టలదండెం.

వగైరా వగైరాలతో పాటు

రంగులద్దుకుని రంగసానిలా కుచ్చున్న
ముంగిట ముగ్గు
సూపుల్తో సుక్కలన్నీ కలిపేస్తారని
వొయ్యారంగా వంకర్లు తిరుగుతూ
ఆశగా ఎదురుసూత్తాది మీకోసం.
*07-08-2012

|| భూమ్యాకాశం ||

వాళ్ళిద్దరినీ ఎప్పటినుండో చూస్తున్నాను

ఎవరు వాళ్ళు ?

ఎప్పుడూ ఒకరివైపొకల్లు అలాగే చూసుకుంటారుఅతను ఎంత ప్రశాంతంగా ఉంటాడో !

అందమైనోడు కూడా

స్వచ్చమైన మనసు పైకి కినిపిస్తూనే ఉంటుంది.

అప్పుడపుడూ అవసరమనుకున్న

మొహమాటపు మబ్బులు కప్పుకుంటాడుఆమె చాలా ఓపిగ్గలది

పచ్చ చీర కట్టుకుని ముచ్చటగా కనిపిస్తుంది.వారి ఇరువురి సంబందం ఏమిటో అని

వాళ్ళకైనా తెలుసో లేదో అని అనుకుంటానుఒకరు పైన

ఒకరు కింద

ఎప్పుడూ అదే తీరు

ఎవరూ మారరు.ఒక్కోసారి ఏమవుతుందో తెలీదు

ఆమె వైపు ఉరిమి చూస్తాడు

తను బెదిరిపోతూ , అతనివైపు భయంగా చూస్తుంది

అతడు కరిగిపోతాడేమో!

కొన్ని చెమట చుక్కల్లాంటివి ఆమె నుదుటిపై కురుపిస్తాడుఅవిఎత్తైన

ప్రదేశాలగుండా ప్రవహించి

ఆమెలోని పల్లుపు ప్రాంతాల్లోకి చేరుతాయిఆ స్వేదాస్కలనంతో సేదతీరుతారుకాబోలు

ఇద్దరూ కొద్దిసేపు ప్రశాంతంగా కనిపిస్తారుఆమె కావాలని కలగజేసుకుని

ఎన్నాళ్ళిలా విడిగా ఉంటాం

మనం కలిసిపోదామా అని అడుగుతుంది

దానికతడు ఎటకారాన్ని ఎరువట్టుకొచ్చి

“ఒసేయ్ తల్లి పీనుగా

మనం కలిస్తే మన బిడ్డలెట్టా బతుకుతారే?

మనసంగమం సాద్యం కాదుగాని

మనమిలాగే ఉందాం

మనబిడ్డల్ని చూసుకుందాం” అంటాడు

ఆమె సరే అని సమాదానపడుతూ

సహృ…

|| ప్రకృతి కాంతకు ||

ప్రకృతి కాంత కై పరితపిస్తూ
నేను తనని ప్రేమిస్తాను
తనూ అంతే
నిన్ను ప్రేమిస్తున్నానని నాతో ఎప్పుడూ చెప్పదు.
నాలాగే నన్ను ప్రేమిస్తుంది ..
నేనూ అంతే ...

నన్ను ఉదయించడం నుండి
నేను అస్తమించేవరకూ అన్ని పనులూ
ఆమె అందంగా చేస్తుంది

ఉదయంపూట చల్లగా మంచుచూపులు చూస్తుంది
చూసి చూసి మద్య్హానానికి వేడెక్కిస్తుంది
సాయంత్రానికి స్లబరుస్తానని చెప్పి
రాత్రిలోనికి రమ్మని పిలుస్తుంది

తనెంత పనిగత్తో
అంత ప్రేమగత్తే కూడా

తనని పదే పదే ప్రేమిస్తున్నానని చెప్పలేక
ప్రాణమున్న పదాలేవో
పనిగట్టుకుని తెచ్చి
కవితని కనే ప్రయత్నం చేస్తాను నేను
ప్రకృతి కాంతకై పరితపిస్తూ నేను

||సరోగశీ||

ఏమేవ్!
ఇది ఇన్నావేటి?
ఇదేదో ఇన్విట్రో పెర్టిలైజేసనట
ఇక్కడ ఏం చేత్తారంటే
నిన్నూ, నన్నూ కలిపేసి ,మనల్ని చేసి
గాజుబుడ్డిలో బందించి
పేణాలు బయటేపోసి
పిండాన్ని లోపలేడతారట తెలుసా
అదే అబివృద్దని అంటున్నారీళ్ళంతా !

ఇక్కడ ఇంకో ఇచ్చిత్రముండాది
అమ్మవలేని అమ్మలకు అండగానిలిచే
అద్దెతళ్ళులున్నారటిక్కడ
ఈళ్ళంతా అమ్మతనాన్ని అద్దెకు ఇస్తారట

వీళ్ళని సరోగేట్ తల్లులంటారట
వీళ్ళమాతృత్వానికి కూడా సక్కని పేరెట్టారు “సరోగశీ” అని
ఈ అద్దె అమ్మలంతా అవసరాలనుండి పుట్టుకొచ్చారు తెలుసా
తమ పిల్లల్ని పెంచడానికి
మరెవరి పిండాన్నో నవమాసాలూ మోసీ ,కనిపెడతారట వీళ్ళు

ఎంత అద్దె అమ్మలైతే మాత్రం
అమ్మతనం వూరుకుంటుందా సెప్పు
ఆడదాన్ని,అమ్మతనాన్ని నిలదీస్తుందట
పుట్టినబిడ్డ నాదేనని ప్రేమకురిపించేలోపు
పేగుబందాన్ని తెంచి
పిల్లల్ని పార్సిల్ చేసేస్తారట

అందించింది అందుకుని
అవసరం ముందు మోకరిల్లి
అద్దె అమ్మలోని ఆడతనం ఆత్మహత్య చేసుకుంటుందట
ఈ విదీ
విదానం
ఏదైనా కానియ్యి
అమ్మలెవరైనా అమ్మలేనని అర్దమవుతుంది నాకు

|| కవికోసం ||

ఒరేయ్ కవీ
మనకి కవిత్వం తలకెక్కిందంటే
ఒప్పుకుంటావా?

ఎండని ఎన్నెలన్నా
ఏడుగుర్రాలోడీ ఎటకారమన్నా
మనకే సెల్లింది

చిక్కటి సీకట్లో
ఆమెతో ఆడుకోడమే కాదు
అతన్నీ ఆటపట్టిస్తాం
ఈది సివర ఊసులాడ్డాలు
మనుసుల్ని మెలికలుతిప్పేసి
మనుసుల్ని పిప్పిసేసి పిండేయడాలే కాదు
ఫిరంగులు పేల్చేయడం కూడా తెలుసు మనకు

అలాగే
అప్పుడప్పుడూ
ఆరోగ్గమైన
అబద్దాలల్లుతాము

నిజాల్ని
నిజంగా
నిక్కార్సుగా
నిలదీసేవాళ్ళేవారు సెప్పు ?

ఎవరో కసిర్తే
మనమో రాయిసుర్తాం
కాపోతే
అదీ కవిత్వంలాగుంటాది
అందుకే
మనమే తోపిక్కడ

ఐతే మాత్రం?

కవిత్వాన్ని
కుంచాలు
కుంచాలుగా
కుమ్మరించక్కర్లేదట

కావాల్సినోళ్ళకి
కావాల్సినంత
కవిత్వం
కావాలట
కవిత్వంలాగ

(*27-08-2012)

|| అక్షర ఆత్మీయత||

గౌరవనీయులైన అని
గౌరవించి రాసినా
ఉబయకుసులోపరి అని
ఊరిస్తూ రాసినా
ప్రియమైన అని
ప్రియంగా రాసినా
ఒకప్పుడు ఉత్తరాలదే ఊపంతా
మనసులోని భావాన్ని
మరో మనసుకి చేరేట్టు రాయడం
మనకప్పుడు మచ్చికే కదా !
మరి ఇప్పుడెందుకు
హాయ్
హలో
హౌఆర్ యూ డూయింగ్?
అంటూ
అయస్కాంత తరంగాలకి
అలవాటు పడిపోతున్నాం !
ఈ యంత్రాలన్నీ
మన మనసుకి మంత్రాలేసి
మన మద్య సాన్నిహిత్య్యాన్ని మరిపించేస్తున్నాయి
కారణాలేమైనా కానియ్యండి
మనమంతా పెరిగి”పోతున్నా”మనే బ్రమలో వున్నాం
వద్దు
మన మద్య ఈ దూరాలొద్దు
అక్షరాలై
ఆప్యాయంగా మాట్లాడుకుందాం
అల్లుకుపోతూ
అతుక్కుని ఉందాం
అందుకే
అందరూ రండి
అక్షరాలుగా వచ్చి అల్లుకుపోండి !
అక్షర ఆత్మీయతని చాటి చెప్పండి

04-09-2012

|| ఈదేసిన గోదారి ||

ఏరా సిన్నోడా
ఎప్పుడూ ఏదో అలోసిత్తావేట్రా?
నీ వొయసులో నేనెంత సురుగ్గా వుండేవోన్నో తెలుసా?
నీకు నా కదసెప్తానిను

నువ్వు యినే వుంటావ్
సరిగ్గా పదేల్లప్పుడే పెల్లిసేసార్నాకు
అప్పుడికి మీయమ్మేమో సీముడుముక్కేసుకుని
ఎర్రబొందులాగూతో
సరిగ్గా ఆ ఈది గుమ్మం మీదే కుచ్చూనుండేది

రాయే అని పిలిత్తే వచ్చేదీకాదు
ఆ గుమ్మం మెట్టుదిగేదీ కాదు
సేన్నాళ్ళు గడిసిపోయిందలాగే
ఆ తర్వాత తెలివొచ్చి,తెలిసొచ్చేసరికి

బల్లో ఒకడు
గుమ్మంలో ఒకడు
ఉయ్యాళ్ళో ఒకడు
తయారయ్యారు మీరు

సంసారాన్ని ఈదటం గురించి మాబాబు నాసొవ్లో ఓమంత్రమేసాడు
అంతే

ముగ్గుబండేసుకుని బయల్దేరాను
సరిగ్గా సీకటడే సరికి
నలభైయూళ్ళు సుట్టొచ్చేవోన్ని

కాతపొద్దోతే సాలు
సుర్రుమనేది మీయమ్మ
రేవవతల రాజుగారింట్లో
పనికోసమెల్లేది
నాకంటే కాతముందే ఇంటికొచ్చేసేది
మీయమ్మకు కొడుకులేమైపోతారో అన్న కంగారుతోపాటు
కటికపేదరికం కూడా కుదురుండనిచ్చేదికాదు

ఎప్పుడూ ఏదోపనే
ఎన్నిపనులు సేసెదనుకున్నావ్?
మీకందరికీ అన్నమెట్టి
మిమ్మల్ల్ని బొజ్జోబెట్టి
ఆ తరవాత నాకూ అమ్మయ్యేది,అన్నమెట్టేది

ఇలాంటివెన్నోరా
ఎన్నని సెప్పను
ఎలగోలాగ
ఇదిగో ఇంతదాకా బతికేసాం 


సెప్పాలంటే మాదంతా ఈదేసిన గోదారి
దిగాల్సిన లోతు ముందున్నప్పుడు  ఇంతేకదా అనిపిస్తుం…

|| నాన్నన్న దేవుడు నాతో చెప్పాడు ||

అమ్మతనం నిండిన
అనంత విశ్వంలోనుండి
అరచేతుళ్ళోకి జారినపుడు
మొదటి ముద్దు అమ్మిచ్చిందట
దాంతో ఒక్కసారి ఉలిక్కిపడి
విశ్వాన్నే జయించిన వీరుడిలా
కనిపించానట నేను

రెండో ముద్దు నాన్నెడితే
నాలుకతీసి ఎక్కిరించానట
కితకితలు పుట్టికాబోలు
అదీ నాన్నే చెప్పాడు

ఈ భూమ్మీద మొదటాకలి తీర్చిన
అమ్మతనాన్ని
చిత్రించాడట మానాన్న
ఆమె చనుబాలు నా నోటికందిస్తూ
ఒళ్ళో ఉన్న నా బుగ్గమీద
ప్రేమచుక్కలు రెండు కురిపించిదట
వాటిని
మా నాన్న
తన ముక్కుతో తుడిచాడట తెలుసా!....?
నాతో చెబుతూ చెమ్మవుతున్నాడిప్పుడు.

"పెరిగి
పెద్దైనా
పేగుబందం తెగదులేరా"

ఆకలినీదైనా
అలమటింపు తనది
అందుకే
ఆమె
అమ్మైందిరా

కడుపులో ఉన్నప్పుడేననుకున్నావా?
పేగుతెంచుకుని పుట్టేసాక్కూడా
నీకాకలైతే తనకెలా తెలుస్తుంది చెప్పు?
ఇంకా ఆ లంకె ఏమిటో?
ఎక్కడుందో?
ఎవడు దాన్ని సృష్టించాడో తెలుసా?

అని అడిగాడు
తెలీదన్నట్టు చూసాన్నేను

దగ్గరకు పిలిచి
చెవిలో నోరెట్టిమరీ నాన్నన్న దేవుడు నాతో చెప్పాడు
"నేనెనని"


*28-08-2012

// కొత్తలో సంగతి //

కాస్త ఎనకోముందో
ఆమె లేస్తుంది
అతనుకూడా

ఒక రకమైన పాచి చూపు చూస్తాడు
ఛీ.....పో అన్నట్టు
సిగ్గు పడుతుంది

అర్జెంటుగా ఆపీసుకెల్లాలంటాడు
అలాగే రెడీ చేస్తానంటుంది

ఆమె అతడికి దోసేస్తుంది
అతడు ఆమెను దోచేస్తాడు

నేను వెళ్తున్నానంటాడు
జాగ్రత్త సుమండీ !
"అన్నట్టు వచ్చేటపుడు"
అంటుంది

అది పూర్తి కాకుండానే
మంచినీళ్ళ వంకతో అతను లోపలికొస్తాడు
ఏమీ ఎరగనట్టు
మూత్తుడుచుకుంటూ బయటకొస్తాడు
కావాల్సినన్ని నీళ్ళు తాగేసి

ఈసారి మంచినీళ్ళు లేవని
మొహమ్మీద తలుపేస్తుంది
అతడు, ఆమె కవరేజ్ ఏరియానుండి వెళ్ళిపోతాడు
ఆమె దయచేసి మళ్ళీ ప్రయత్నిస్తుంది

కొద్దిసేపు బీప్..............బీప్ .................బీప్

"ఆ ఇప్పుడేవస్తున్నా సరేనా"
అంటూ
ఆరవగానే అతను అప్ర"మత్తుడై"పోతాడు

అక్కడాగి
అందుకోసం
మూర మల్లెలు
ముప్పై రూపాయలైనా కొనేస్తాడు

ఆమె కళ్ళలో వత్తులేసుకుని కూచుంటుంది
అతడెల్లి వెలిగిస్తాడు
ఆమె అతడికి వడ్డిస్తుంది
అతడు ఆ"మెను" ఆరగిస్తాడు
ఆమె అందిస్తుంది
అతడు అందుకుంటాడు

విందైపోతుంది
లైటు కూడా బందైపోతుంది
రెండు దిండ్లు
ఒక దుప్పడితో సరిపెట్టుకుంటారు
రాత్రి రంజుకుంటుంది
మెల్ల మెల్లగా చల్లరేసరికి
ఇరివురికీ …

|| అంతా ఉత్తిదే ||

నువ్వునాకు బందువా?

బామ్మర్దివా?

అయినా సెప్తాను!

నీ నిజరూపం తెలిసినపుడు

నవ్వుపులుముకొచ్చి

పల్లుబైటెట్టి

నొచ్చుకుంటూ మెచ్చుకుంటారు నిన్ను

సన్మానానికి తీస్కెళ్ళి

సాలువాకప్పి సాగనంపేత్తే సరిపోద్దేటి నీకు?

సిగ్గులేదూ!

నీ సరుకెంతో నీకూ తెలుసు

పోనీలే ఇదంతా ఎందుగ్గానీ

ఎవడిపిచ్చాడిది

ఎవడీడు ఎదవగోలేడుతున్నాడనుకోకు

నిన్ను నువ్వు తడిమి సూడు

నా తడేదో తగలక పోదు

మనిసికెలాగా తప్పదు

మనసుకు ముసుకెందుకని సెప్తున్నాను

వింటే విను

లేపోతే అంతా ఉత్తిదే

*10-08-2012

|| కలొచ్చింది ||

మా అమ్మనన్ను తెలుగులో కన్నట్టు
నాకు తెలుగుగ్గుపెట్టినట్టు
తెలుగుపాలు పట్టినట్టు
తెలుగుజోలపాడినట్టు

నేను తెలుగుతొడుక్కుంటున్నట్టు
తెలుగురాసుకుని
వొళ్ళంతాపూసుకు తిరుగుతున్నట్టు
తెలుగు సూసినట్టు
విన్నట్టూ
వాగినట్టు
తెలుగుతిన్నట్టు
తిడుతిన్నట్టూ
తెలుగును కట్టుకున్నట్టు
కాపురం చేస్తున్నట్టూ
నేను తెలుగులు కన్నట్టు
వాటికి తెలుగు నేర్పుతున్నట్టూ
నా తెలుగిలాగే తన సుట్టూ తాను తిరుగుతున్నట్టూ
నాదినం గడుస్తున్నట్టూ
.
.
.
నాకు కలొచ్చింది

*09-08-2012

|| సొంతడబ్బా కొంతమానకు ||

పొద్దున్నే లెగిసి
ఓ ముద్దు ముడుపిచ్చి.
మద్దేలకు తిరిగొచ్చి
మళ్ళీ మూతి బిగించి

సాయం’కాలానికి’ గేలమేసి
నీ సూపులన్ని పట్టేసి.
ఆ కాలాన్ని నిలవేసి
కవితలెన్నోరాసి.
చుక్కలొన్నో తెచ్చి
నీ పక్కన పడేసి
రాత్రులెన్నో రాసిచ్చే
నాలాటి వస్తాదు మొగుడొస్తాడని
ముస్తాబైన బుల్లెమ్మా
నీ దస్తావేజులు పట్రా!
ఓ సంతకం సేసేత్తాను.

*07-08-2012

॥మగాళ్ళ సంత॥

నల్లగా నిగనిగలాడే
మట్టగిడస,
నాజూకైన నడుమున్న
షీలావతి,

కుర్రమేను కలిగిన
కొర్రమేను,
బొత్తిగా సేతికి సిక్కని
బొమ్మిడాయి,
పిచ్చపట్టించేటట్టున్న
బొచ్చుపిల్ల,

కుదురంటూ ఉండని
కానాగంత,
నిండుమనసున్న
పండుగప్ప,
వలసతీసుకుపోయే
పులస్సేప,
అన్నీ ఆడసేపలే దొరుకుతాయ్

అదేంటోమరి
మన మొగోళ్ళసంత

*2.8.2012

|| ఘనస్వాగతం ||

పుష్పకవిమానం దిగిన దేవేంద్రున్ని సూసినట్టు
బస్సు దిగ్గానే నన్ను సూస్తూ తన రెండు చక్రాలరదానికి స్టాండేస్తాడు మా నాన్న.
బుజాన వేలాడుతున్న బ్యాగ్ తీసి, సైకిల్ మీద పెట్టుకుంటూ
పయానం బాగాసాగిందా?
సీటు కుదిరిందా లేదా?
సరిగా తినడంలేదేటి? సిక్కిపోయావ్! అడుగుతూనే ఉంటాడు
ప్రశ్నలు పూర్తికాకుండానే
సమాదానాల సర్వీస్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకుంటాను నేను
ఇన్స్టాలేషన్ ఎర్రర్ లాగ ఎవడో ఎనకాల టింగు టింగుమని బెల్లు మోగిస్తాడు
ఇక్కడేఉండరా ఇంటికెల్లి ఈ పిండిమూట,నీ బేగ్గు పడేసి మల్లొచ్చి తీసుకెల్తానని ఎల్తాడు
సరేనని పెత్తాతకొట్టుకాడ ఓ సల్లని సోడాతాగి,సెక్క బల్లపైకుచ్చుంటాను.
ఇంటికెల్లిన పెద్ద మనిసి అరగంటైనా తిరిగిరాడు.
ఇకనేనే మెల్లగా నడిసెల్లిపోదామని,కాలవగట్టమ్మటా నడకలంకించుకుంటాను
పక్కన కొత్తనీట్లో తేలుతున్న అంటిబొందమీద
తలకాయూపుతూ బురదపామొకటి నాలుకబయటకు తీసి నన్నెక్కిరిస్తుంది.
ఇంకోపక్క దమ్ముసేల్లోన్ని అమ్మలంతా
కచ్చాపేసుకుని క్రమశిక్షణేదో నాటుతుంటారు.
ఎలా సూస్తుందో ఓ సక్కనమ్మ
ఏరా అల్లుడా బోగున్నావా?
ఇదేనా రాడాం? బాగా సిక్కిపోయావేట్రా? ఆగడంలేదింక.
బాగున్నను బాప్ప! మాయెలా వున్నాడు? తప్పదన్నట్టు అడగుతాన్నేను
అంతాబోగున్నార్రా! సరేలే …

అచ్చమైన ఆకలి

స్వచ్చమైన నేతిమిఠాయొకటి
సుడీదార్ కట్టుకొని
స్వీట్ షాప్ నుండి బయటకొస్తావుంటే
ఆ తియ్యనైన అందాన్ని తినాలో పంచిపెట్టాలో తెలియక చూస్తున్ననన్ను
తొక్కతీసేసిన మొక్క జొన్నపొత్తొకటి
తప్పుకొమ్మని తోసేస్తే
కోకసుట్టిన కాజా ఒకటి కాపాడేందుకు ప్రయత్నించింది.
అటుసూసి,ఇటుసూసేలోపే
ఆ నేతిమఠాయి కాస్తా,
పీసుమిఠాయి పేసేసుకుని,ఎవడికోసమో ఎదురుసూత్తావుంది.
వెదవది పోతేపోయింది
గులాబీరంగు జిలేబీ మంచిబలేగా వుంటాదని
దానికోసం రోడ్డుదాటుతుంటే,హడావుడిగా పోతున్న హలీమొకటి అడ్డుపడింది
ఒక సలాం కొట్టి సాగనంపేసాను.
పక్కబండికాడ సగం తడుస్తూ నుంచుంది పానీపోరొకటి.
కొంచెం కారంగా,గారంగా తినుకుంటూ తాగుదామని
పోయి పక్కన్నిల్చున్నాను.
తాగుతుంది మినరల్ వాటరు కాదేమో, జనరల్ వాటరైతే జలుబు సేత్తాదని
ఇదొద్దురాబాబూ అని అక్కడనుండి కూడా వచ్చేసాను
కాస్త పొడుగ్గా,నాజూగ్గా మసాలాసల్లిన బజ్జీలు కనిపించేసరికి మరోబండి దగ్గరాగిపోయాను
కొన్ని పొట్టిమిరగాయలు,కొన్ని గట్టిమిరగాయలు కనబడ్డాయక్కడ.
సూడ్డానికే కారంగా కనిపిస్తున్నాయ్, తింటే దిమ్మతిరిగిపోద్దని బయపడి.
సల్లగా మెల్లగా షోడాహబ్ దగ్గరకొచ్చాను.
అక్కడ ఏరంగుదాన్ని సూసినా బుస బుసలూ, రుస రుసలే.........పొంగుతూ,తొంగిచూస్తూ!
ఇక …

॥మళ్ళెప్పుడొస్తావ్?॥

మబ్బుపట్టిన మొహమేసుకుని
మసక సూపులు సూత్తావ్
వానలా వత్తానని
వరదై ముంచెత్తుతావ్
కరిగించేత్తావ్
కదిలించేత్తావ్
కొట్టుకుపొయేట్టు చేత్తావ్
ఒక్కోసారి మొలకెత్తిస్తావ్, పులకెత్తిస్తావ్
పూయనిస్తావ్,కాయనిస్తావ్
అన్నీ ఇచ్చి అస్తమిస్తావ్
ఏడాదికోసారి ఉన్నానంటూ ఉదయిస్తావ్.
మళ్ళెప్పుడొసావ్?
*******
వాతావరణ కేద్రం హెచ్చరికలు జారీ
ఈ రాత్రికి ఋతు పవనాలు ఎటో దారి మళ్ళాయి

నేరేడులంక

అబ్బా చీకటి పడితే మా ఊరు ఎ౦తబావు౦టు౦దో!

నల్లచీరకట్టుకున్న నిశిసు౦దరెవరో వీదులె౦బడి తిరిగుతూ,ప్రతీ ఇ౦టిని పలకరిస్తు౦ది

దానికితోడు గుడ్డిదీపాలు రొమా౦టిక్ రాత్రికి మరి౦త త్వరగా స్వాగత౦ పలుకుతాయ్!

పొయ్యి దగ్గర అళివేళమ్మ,కొ౦గులాగుతూ కూచున్న వె౦కన్న "విన్సె౦ట్ వా౦గో" పెయి౦టి౦గ్ లా కనిపిస్తారు

పట్నం నుంచి పనికెల్లిన తన వస్తాడు మొగుడు వస్తాడని ముస్తాబవుతుంది బత్తులోల్ల బుల్లెమ్మ

కూరదాకలోని కుతూహల౦ కుతకుతమ౦టో౦ది!

మొ౦డీదోళ్ళ గొడవలు సద్దుమనిగిపోతాయ్

తాగుబోతు వీరయ్యకు స్నాన౦చేయి౦చే వీరనారి ర౦గమ్మను

అరుగుమీద చుట్ట చుట్టుకు౦టున్న మా సాయిబు తాత అదేలోక౦ చూస్తాడు!

దడేలుగాడు ప్రతివాళ్లని పలకరిస్తూ వీదులన్నీ విహరిస్తాడు

సలాది సుబ్బయ్య వీదిదీపాలార్పెస్తాడు...

ఆ తర్వాత నా సామిర౦గా!
ఊరంతా ఒకటే సౌండు ! కమాన్ గుస గుస అని .


నేరేడులంక  నిదరోతు౦ది!
*24.7.2012